మెరిపించే బీట్ రూట్


ఎర్రటి బీట్‌రూట్ లో ఎ, బి, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. క్యాల్షియం, ఫాస్పరన్, పొటాషియం , మెగ్నీషియం , ఫోలిక్ ఆమ్లం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ అందాన్ని కాపాడటంలో కీలకంగా పనిచేస్తాయి. బీట్ రూట్ రసాన్ని రోజూ తాగితే రక్తశుద్ధి జరుగుతుంది. దీన్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి. దాంతో చర్మం నిగారింపు పొందుతుంది. బీట్ రూట్ ని మిక్సీలో వేసి మెత్తని గుజ్జుగా చేయాలి. దానికి కప్పు ఓట్ మీట్, చెంచా తేనె, రెండు చుక్కల నిమ్మరసం కలవండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి, ఇరవై నిమిషాల తరువాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రపరచుకోండి. ఇలా తరచూ చేస్తుంటే దుమ్మూధూళీ ప్రభావం చర్మంపై ఉండదు. చర్మ గ్రంథులు శుభ్రపడతాయి. మచ్చలూ ముడతలూ వంటివి తగ్గుముఖం పట్టి చర్మం తాజాగా కనిపిస్తుంది. జుట్టు తెల్లబడిందనో, లేక చక్కని రంగు కావాలనిపించో, రసాయనాలతో కూడుకునన కృత్రిమ రంగుల్ని వాడుతుంటారు చాలా మంది. వీటివల్ల జుట్టు పాడైపోతుంది. ఇలాంటప్పుడు గోరింటాకు పొడిలో రెండు చెంచాల బీట్ రూట్ పౌడర్ని కలపాలి. ఈ రెండింటిని టీ డికాక్షన్ లో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తలకు రాసుకుంటే జుట్టు చక్కని రంగులోకి మారుతుంది. ఆరోగ్యంగా ఎదుగుతుంది. బీట్ రూట్ రసంలో చెంచా నిమ్మరసం కలిపి తలకు పట్టించినా ఫలితం ఉంటుంది. పెదాలు నల్లగా, గరుకుగా ఉండి ఇబ్బంది పెడుతుంటే.. బీబూట్ రసంలో కొంచెం తేనె కలిపి పెదాలకు రాసుకోండి. నాలుగైదు నిమిషాల తరువాత చన్నీళ్లతో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే నలుపు తగ్గుతుంది.